Nara Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టుపై స్పందించిన బాలకృష్ణ, పురందేశ్వరి.. ఏమన్నారంటే ?

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నాయకులతో పాటు పలువురు విపక్ష నేతలు ఖండిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 01:55 PM IST

Nara Chandrababu Naidu Arrest : ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీ నాయకులతో పాటు పలువురు విపక్ష నేతలు ఖండిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు. ఇక ఇదే క్రమంలో టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.

ఈ మేరకు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ దుర్మార్గం అని అన్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని.. చంద్రబాబును ఎలాగైనా జైలులో ఉంచాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆధారాలు లేకుండా ఏ చట్టప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జిషీట్ వేయలేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

అలానే దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తప్పు పట్టారు. ప్రోసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్టు చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు సమర్థనీయం కాదని ఆమె అన్నారు.ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఆమె ఖండించారు.

అలానే ఒక్క పథకం ప్రకారం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.  చంద్రబాబు అరెస్టును సిపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ సహా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించడం దుర్మార్గమని ఆయన అన్నారు.