AP Bandh : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఈ బంద్ కు ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలోనే పలు ప్రైవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఒక ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ లో.. నీతి నిజాయతీకి మారుపేరు అయిన చంద్రబాబుపై సైకో జగన్ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేసింది. నిరంతరం ప్రజల కోసం పనిచేసే ప్రజా నాయకుడిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండుకు పంపడం బాధాకరం. ఇది తెలుగు ప్రజలపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి.. తెదేపా అధినేత అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై దమనకాండ, కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించాం. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా, విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ శ్రేణుల ఆందోళన#APBandhForCBN#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu pic.twitter.com/SvARZzCDhm
— Telugu Desam Party (@JaiTDP) September 11, 2023
అదే విధంగా జనసేన శ్రేణులు కూడా ఈ బంద్‌లో శాంతియుతంగా పాల్గొనాలని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని జనసేన ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న పాలకపక్షం.. ప్రజాకంటక చర్యలకు పాల్పడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ వేధిస్తోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన నిరసిస్తోంది. సోమవారం జరిగే బంద్‌కు జనసేన సంఘీభావం ప్రకటిస్తోందని.. సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.