Site icon Prime9

Ambati Rambabu : చంద్రబాబుకు నిజం గెలిచిందని బెయిల్ ఇవ్వలేదు.. కళ్లు కనిపించడం లేదని ఇచ్చారు – అంబటి రాంబాబు

Ambati Rambabu shocking comments on cbn bail

Ambati Rambabu shocking comments on cbn bail

Ambati Rambabu : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.  అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు వచ్చే నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది హైకోర్టు. ఈ క్రమంలోనే తెదేపా శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. అయితే వైకాపా నేత మంత్రి అంబటి రాంబాబు ఈ బెయిల్ వ్యవహారంపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా.. చంద్రబాబుకు నిజం గెలిచిందని బెయిల్ ఇవ్వలేదని.. కళ్లు కనిపించడం లేదని బెయిల్ ఇచ్చారని.. రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అదే విధంగా మీడియా సమావేశంలో కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందిస్తూ సెటైర్లు వేశారు.  హైకోర్టులో చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారన్న ఆయన.. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని టీడీపీ నాయకులు హంగామా చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానాలని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

ఈ కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదని.. అనారోగ్య కారణాలతో మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి అంబటి. డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం కంటి వైద్యం  కోసం మానవతా దృక్పథంతో కోర్టు బెయిల్ ఇచ్చిందన్న ఆయన.. యుద్ధం ఇప్పుడే మొదలైందని నారా లోకేష్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. ఈ కేసులో చాలా విచారణ మిగిలే ఉంది.. విదేశాలకు పారిపోయిన నిందితులను తీసుకువచ్చి విచారణ చేయించాలన్నారు. 1983లో ఎక్కడైతే ఎన్టీఆర్ జెండా ఎగుర వేశాడో.. అక్కడ టీడీపీ జెండా పీకేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, ఆంధ్రలో త్వరలో పీకేస్తారు.. ఇది నిజం అంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది.. అందుకే టీడీపీకి రాజీనామా చేశాడు.. ఎన్టీఆర్‌ను చంపిన చేతులతోనే ఆయన పెట్టిన టీడీపీని కూడా చంపేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.

 

Exit mobile version