Janasena Party : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మార్చుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పార్టీలు, నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ రోజురోజుకీ మరింత బలంగా మారుతుంది. ఈ క్రమంలోనబె వైకాపా మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనాని తో భేటీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.
కాగా ఈయన సోదరుడు, వైసీపీ నేత ఆమంచి స్వాములు తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను నివాసంలో కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. అలానే పవన్ తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ను కూడా స్వాములు, ఆయన కుమారుడు రాజేంద్రలు కలిశారు. జనసేన పార్టీకి తన అవసరం మేరకు పని చేస్తానని పవన్‌కు స్వాములు తెలిపినట్లు చెబుతున్నారు. ‘మీ లాంటి పెద్దలు పార్టికి ఏంతో అవసరమని’ పవన్ స్వాములతో అన్నారని సమాచారం అందుతుంది. ఈ నెలాఖరులో స్వాములు జనసేన పార్టీలో చేరతారని ఉహగాహనాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఇటీవల ఆమంచి స్వాములు ఫోటో జనసేన పార్టీ (Janasena Party) ఫ్లెక్సీలో ఉండటం చర్చనీయాంశం అయ్యింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జనసైనికులు దీనిని ఏర్పాటు చేశారు. స్వాములు సోదరుడు, అప్పుడే పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. స్వాములు నిర్ణయంపై ఆయన సోదరుడు కృష్ణమోహన్ ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా 2009 లో ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా చీరాల నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడారు. కొద్ది రోజులకు చీరాల ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు. కొంత కాలానికి ఆమంచికి చీరాలలో ప్రాధాన్యం తగ్గింది. బలరాం వర్గంతో వర్గపోరు మొదలయ్యింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కూడా సైలెంట్ అయ్యారు.. పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చీరాల బాధ్యతల్ని కరణం బలరాం కుటుంబానికి అప్పగించి.. ఆమంచిని పర్చూరు ఇంఛార్జ్‌గా నియమించారు. ఇప్పుడు ఆమంచి సోదరుడు స్వాములు జనసేన పార్టీ వైపు చూడటం ఆసక్తికరంగా మారింది.