Janasena Chief Pawan Kalyan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేనాని పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో జనసేన-బిజెపి పొత్తులపై అమిత్ షాతో పవన్ చర్చలు జరుపుతున్నారు.
జీహెచ్‌ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కనీసం 20 స్థానాలు తమకు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కొన్ని స్థానాలు కావాలని జనసేన కోరుతోంది. గత వారం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే . ఈ సందర్బంగా జనసైనికుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ గారు బిజెపి నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బి.జె.పి. అభ్యర్ధుల గెలుపునకు కృషి చేశామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలనుంచి విరమించుకుని బి.జె.పి. అభ్యర్ధుల విజయానికి కృషి చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి , లక్ష్మణ్‌కి జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై మరికొద్ది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.