Venkayya Naidu : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వలో తన భవిష్యత్తు రాజకీయాల గూర్చి మనసులో మాటని బయటపెట్టారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. కేరక్టర్, కేలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అనే నాలుగు ‘సీ’లు రాజకీయాల్లో ఉండాలని తాను తరచూ చెబుతుంటానని వెంకయ్య తెలిపారు. కానీ ఇప్పుడు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అనే నాలుగు ‘సీ’లు రాజకీయాల్లోకి వచ్చాయన్నారు. మొత్తం రాజకీయాలను ఇవే ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా రాజకీయాల నుంచి తాను చాలా ముందుగా రిటైరైపోయానేమోనని అనిపిస్తోందని తెలిపారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరిగిపోవడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఏపీలో పార్టీల పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడే వారిని మళ్లీ గెలవనివ్వకుండా ప్రజలే తీర్పు చెప్పాలని సూచించారు.
ఇక తనకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులపై ఏ మాత్రం ఆసక్తి లేదని వెంకయ్య నాయుడు చెప్పారు. మోదీ నాయకత్వం అంటే తనకు బాగా ఇష్టమని… ఆ నాయకత్వం దేశానికి చాలా అవసరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. కానీ అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేదని వివరించారు.