Vande Bharat Express: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది. హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించారు. అయితే ఈ రైలుపై వరుసగా దాడులు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్- వైజాగ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి చోటు చేసకుంది. మహబూబ్ బాద్- గార్ల మధ్య రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో ఒక బోగి అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాళ్లు విసిరిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రైలులోని సీ8 కోచ్ పై రాళ్లు విసిరారని.. సీట్ నంబర్లు 41,42,43 వద్ద ఉన్న అద్దాలు పగాలాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
గతంలో కూడా దాడులు(Vande Bharat express)
గత వారం కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు.
అంతకుముందు కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వందే భారత్ రైలు ప్రారంభానికి ముందు ఆకతాయిలు రాళ్లు విసిరిన ఘటన విశాఖలో జరిగింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్‌కు ట్రైన్ వెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు విండో అద్దం ధ్వంసమైంది.