Rain Alert in Ap – Ts : అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఎండలు పట్టా పగలే చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు వానలు కూడా దంచికొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం..
గత రాత్రి మరోసారి నగరాన్ని వాన కుమ్మేసింది. కుండపోత వర్షంతో నగరం అంతా తడిసి ముద్దైంది. ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. కూకట్ పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడగా.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వానలు దంచికొడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో మిరప, మొక్కజొన్న తడిచి ముద్దవ్వడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అలానే ఏపీలో కడియం వెంకట్రావు అనే వ్యక్తి పిడుగు పడి మృతి చెందాడు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మంగళవారం మన్యం,అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్,సత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి “పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు.దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1/4 pic.twitter.com/esq7h1ieH9
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 30, 2023
తెలంగాణలో..
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడుతుంటే, వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రానున్న 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 5 రోజులు తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమ్రుంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని అంచనా వేసింది.