Andhra Pradesh: వైసీపీ ఎంపీ మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఇది ఫేక్ వీడియో అని మీడియాకు తెలిపారు. దీని పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.
వీడియో ఫేక్ అని ఏ ఫోరెన్సిక్ నివేదిక తెలిపిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చూపించాలని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు గోడల మధ్య జరిగింది అన్నారని, ఎస్పీ అసలు వీడియో గోరంట్లదే కాదు అని చెబుతున్నారని లోకేష్ గుర్తుచేశారు. అయినా వీడియో పై ఎస్పీ అలా ఎలా ప్రకటిస్తారని, ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా, అని ప్రశ్నించారు. ఓ సిస్టమ్, ప్రొసిజర్ అంటూ ఉంటుంది కదా అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఐదు రోజుల తర్వాత ఫేక్ అని చెప్పడం హాస్యాస్పదం అని, మంత్రి అంబటి రాంబాబు రాసలీలలు కూడా ఫేక్ అంటారా అని లోకేష్ సందేహం వ్యక్తం చేశారు.