Nadendla Manohar : ఏపీ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమవడం మరింత చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఇలా పవన్, చంద్రబాబు భేటీ కావటం ఇటీవల కాలంలో ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని.. అందులో భాగంగా చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి.
కాగా ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీకి సంబంధించి జనసేన రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు-పవన్ భేటీ సీక్రెట్‌ను రివీల్ చేశారు. జనసేనాని పవన్.. వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అందులో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరిపారని చెప్పారు. ఈ ముఖ్యమంత్రిని గద్దెదించి ప్రజలకు నమ్మకమైన పాలన అందించేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని.. తాము పదవుల కోసం కాదని, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో మరికొన్ని సమావేశాలు జరుగుతాయని, అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం మొదలైంది. హైదరాబాద్ లోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. pic.twitter.com/73egeO8hx5
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2023
ఈ కార్యాచరణ ఏడాది క్రితమే ప్లాన్ చేశాం – నాదెండ్ల (Nadendla Manohar)
అలానే మాట్లాడుతూ.. పవన్ జనసేనతో వచ్చింది పదవుల కోసం కాదని.. రాష్ట్ర ప్రజల కోసమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా అన్ని పార్టీలను ఏకతాటి పైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని.. దానికి మేం సంవత్సరం క్రితమే కార్యచరణ రూపొందించామని తెలిపారు. అందుకు జనసేన కట్టుబడి ఉందని.. వైఎస్సాఆర్‌సీపీ విముక్తాంద్రప్రదేశ్ కోసం అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. అందులో చంద్రబాబుతో పవన్ చర్చించారని.. ప్రజలకు మంచి పాలన అందించేందుకు జనసేన కచ్చితంగా ప్రయత్నం చేస్తుందని వివరించారు.