Nirmal District: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు.
కడెం ప్రాజెక్టుకు 4.97 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోకి భారీగా వస్తుండగా, ఔట్ ఫ్లో అదేస్థాయిలో లేకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కడెం ఉధృతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
వరద ఉధృతి పై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్‌చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు.