Gannavaram: గన్నవరం టీడీపీ కార్యాలయంలో వైసీపీ విధ్వంసం.. ఉద్రిక్తత

గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Gannavaram: గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.

కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.

కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీ కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.

పట్టించుకోని పోలీసులు(Gannavaram)

ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.

ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం విశేషం.

టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అంత నష్టం జరిగేది కాదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది.

 

 

విమర్శల నేపథ్యంలో

కాగా, రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పై వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వంశీపై ఎదురుదాడికి దిగారు.

ఈ క్రమంలో వంశీ అభిమానులు టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా..

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారు.

ముఖాముఖి తేల్చుకోవడానికి సిద్ధమా

తాజా ఘటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గు చేటని విమర్శించారు.

దొంగదెబ్బలు తీయడం కాదని, విజయవాడ సెంటర్ లో ముఖాముఖి తేల్చుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే వంశీ, కొడాలి నానీ తదితరులు టీడీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లారో అందరికీ తెలుసని అన్నారు.

ఈ రోజు నుంచి వైఎస్సార్స్ పీ నేతల పతనం మొదలైందన్నారు. టీడీపీ నేతల సహనాన్ని పరీక్షించవద్దని తెలిపారు.