Site icon Prime9

Free booster dose: తెలంగాణలో నేటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్

Hyderabad: తెలంగాణలో నేటి నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ద‌వాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. 75 రోజుల పాటు జ‌రిగే ఈ వ్యాక్సినేష‌న్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారంద‌రికి బూస్టర్ డోస్ ఇచ్చేలా, త‌ద్వారా క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుందని అన్నారు

ఇప్పటి వ‌ర‌కు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు అసుప‌త్రుల‌కు అనుమ‌తించింది. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా బూస్టర్ డోస్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో బూస్టర్ డోస్ పంపిణీకి అనుమ‌తించామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉందిని పేర్కొన్న మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ అందించేలా ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించామన్నారు.

నేటి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ వాక్సిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్టాండ్​లలో 24 గంటల పాటు బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచుతామన్న మంత్రి, హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్క్​ప్లేసెస్​లో కోరినవారికి టీకా ఆయా ప్రాంతాల్లో అందిస్తామన్నారు.

Exit mobile version