Site icon Prime9

BJP Bike Rally: తెలంగాణలో నేటి నుంచి బీజేపీ బైక్ ర్యాలీ యాత్రలు

Hyderabad: తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం దృష్టి కేంద్రీక‌రించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజ‌ల్లో ఉండాల‌ని ఆ పార్టీ నేత‌లు నిర్దేశించారు. ఇందులో భాగంగా ప‌ల్లె గోస‌- బీజేపీ భ‌రోసా పేరుతో నేటి నుంచి బైక్ ర్యాలీ యాత్రలు నిర్వహించ‌నున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌ఛార్జి త‌రుణ్‌చుంగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌లు ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవ‌ర్గ స‌భ్యుల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు ఒక‌టి చొప్పున 14 జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 రోజుల పాటు ఈ యాత్ర కొన‌సాగుతోంది.

అదిలాబాద్‌లో ధ‌ర్మపురి అరవింద్, మంచిర్యాల‌లో సోయం బాబూరావు, జుక్కల్ లో వెంక‌ట‌స్వామి, వేముల‌వాడ‌లో యండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, బోధ‌న్‌లో రాజాసింగ్‌, సిద్ధిపేట‌లో పి. ముర‌ళీధ‌ర్‌రావు, తాండూరులో డీకే అరుణ‌, మేడ‌్చల్‌లో జితేంద‌ర్ రెడ్డి, సూర్యాపేట‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దేవ‌ర‌క‌ద్రలో ఈట‌ల రాజేంద‌ర్‌, క‌ల్వకుర్తిలో బాబు మోహ‌న్‌, వ‌న‌ప‌ర్తిలో కె. ల‌క్ష్మణ్, న‌ర్సంపేట‌లో ఎం. ర‌ఘునంద‌న్‌రావు, కొత్తగూడెంలో గ‌రిక‌పాటి మోహ‌న్‌రావులు యాత్ర నిర్వహించ‌నున్నారు.

తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వంతో పాటు కేంద్ర నాయ‌క‌త్వం ప్రత్యేక దృష్టిసారించింది. మ‌రో ఏడాదిన్నర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ గ‌డ్డపై కాషాయం జెండాను ఎగుర‌వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆపార్టీ నేత‌లు ప‌కడ్బందీ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వ‌ర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాష్ట్రంలో మాట‌ల య‌ద్ధం కొన‌సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ చేప‌ట్టబోయే బైక్ ర్యాలీ యాత్రల ద్వారా రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాల‌న సాగిస్తుంద‌ని, ఇచ్చిన హామీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌ని, బీజేపీతో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌ని నేత‌లు ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.

Exit mobile version