Site icon Prime9

Polavaram Row: పోలవరం వల్లే భద్రాచలం వద్ద వరదలు వచ్చాయన్న మంత్రి పువ్వాడ.. కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రులు అంబటి, బొత్స

Polavaram Row: ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.

ఇక ఏపీ ప్రభుత్వ చర్యలపై ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. ఇష్టానురీతిన ప్రాజెక్టుల ఎత్తు పెంచుతున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు పెంచితే ఖమ్మం జిల్లా ముంపుకు గురౌతుందని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ మరో అడుగు ముందుకేసి, పోలవరం ప్రాజెక్ట్‌ వల్లే ఖమ్మం జిల్లాకు వరదలు వస్తున్నాయని అన్నారు. పోలవరం వల్ల గోదావరి ప్రవాహం నెమ్మదిగా వెళుతోందని, దాని వల్ల ఎగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఏపీ సర్కార్ వెంటనే పోలవరం ఎత్తును తగ్గించాలని, లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. భద్రాచలం వద్ద గోదావరి దాదాపు 80అడుగుల వరకు ప్రవహించిందన్నారు ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య. అధికారిక లెక్కలు లేకున్నా, అక్కడి ప్రజలు చెప్పే విషయాలు వింటే పూర్తిగా అర్థమౌతుందన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు ముంపులో ఉన్నాయని, పోలవరం ఎత్తు పెంచితే పూర్తిగా మునిగిపోతాయన్నారు. ఇదే జరిగితే చరిత్ర ఎవరిని క్షమించదన్నారు సండ్ర.

ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. పోలవరం వల్లే తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపుకు గురౌతున్నాయనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పై బురద జల్లేందుకే కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలంతా బాగుండాలనేదే తమ అభిమతమని, అందుకే ప్రాజెక్టు ఎత్తు పెంచామని చెప్పారు అంబటి రాంబాబు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పోలవరం ఎత్తు పెంపుపై స్పందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. విలీన గ్రామాలకు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. విలీన గ్రామాల పరిస్థితి సరిగా లేదని, తెలంగాణలో కలపాలంటున్నారని, అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదని ఆంధ్రప్రదేశ్ ను కూడా తెలంగాణలో కలుపుతారా అని ప్రశ్నించారు. మరోసారి విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే, హైదరాబాద్ ను కూడా ఏపీలో కలపాలనే డిమాండ్ తెస్తామన్నారు బొత్స.

 

Exit mobile version
Skip to toolbar