Israel- Palestine conflict: పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్‌కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది. ఒక పార్టీలో హమాస్ తనను కిడ్నాప్ చేసిందని, తాను వైద్య చికిత్స పొందుతున్నానని తెలిపింది.
త్వరగా నన్ను పంపించండి..(Israel- Palestine conflict)
నేను మియా షేమ్, షోహమ్‌కి చెందిన నేను ప్రస్తుతం గాజాలో ఉన్నాను. నేను నేను ఒక పార్టీలో ఉండగా నా చేతికి తీవ్రంగా గాయమైంది. గాజా ఆసుపత్రిలో 3 గంటల పాటు నా చేతికి శస్త్రచికిత్స జరిగింది. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాకు మందులు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. నన్ను ఇంటికి తీసుకురావాలని మాత్రమే నేను అడుగుతున్నాను. వీలైనంత త్వరగా నా తల్లిదండ్రులకు, నా తోబుట్టువుల వద్దకు వీలైనంత త్వరగా నన్ను పంపించండి అంటూ యువతి వీడియోలో చెప్పింది.
బందీలు మా అతిథులు..
గాజాలో విదేశీయులతో సహా 200 నుండి 250 మందిని బందీలుగా ఉంచినట్లు హమాస్ అధికార ప్రతినిధి అబు ఒబెయిదా టెలివిజన్ ప్రకటనలో తెలిపారు.వారు తమ అతిథులు కాబట్టి వారిని రక్షిస్తామని ఒబెయిదా చెప్పారు. అయితే పరిస్థితులు అనుమతించినప్పుడు మాత్రమే వారు విడుదల చేయబడతారని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సేనలు భూదాడికి దిగి తమను భయపెట్టవద్దని తాము దేనికయినా సిద్దంగా ఉన్నామని చెప్పారు.ఇజ్రాయెల్ మరియు అరబ్ నేతలను కలవడానికి తాను బుధవారం ఇజ్రాయెల్ మరియు జోర్డాన్‌లకు వెళతానని యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. మరోవైపు హమాస్ సైనిక మరియు పాలక సామర్థ్యాలను నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ ఆగదని అధ్యక్షుడు నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్పష్టం చేశారు.