Site icon Prime9

Tawang: వీడియో ఇదేనా? 300 మంది చైనా సైనికుల్ని తరిమి, తరిమి కొట్టిన 100 మంది ఇండియన్ ఆర్మీ

India-china solders fight in tawang viral video

India-china solders fight in tawang viral video

Tawang: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. అయితే, తవాంగ్ ఘర్షణకు సంబంధించింది అంటూ ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో ప్రకారం.. వందలాది మంది చైనా సైనికులు సరిహద్దును దాటుకుని ముందుకు వచ్చారు.
వారికి అడ్డుగా ఇండియన్ ఆర్మీ ముళ్ల కంచెల్ని వేసింది. ఈ ముళ్ల కంచెకు అటువైపు నుంచి చైనా ఆర్మీ, ఇటు వైపు నుంచి ఇండియన్ ఆర్మీ సైనికులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్నారు. ఈ వీడియోను బట్టి చైనా సైనికులు డిఫెన్స్ మోడ్‌లో ఉండగా.. ఇండియన్ ఆర్మీ సైనికులు వారిని తరిమి కొడుతున్నారు. అలా చైనా సైనికులు వాస్తవాధీన రేఖ దాటే వరకూ ఇండియన్ ఆర్మీ వారిని వెనక్కు పంపించింది. ఆ తర్వాత భారత సైనికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారు అనేది స్పష్టంగా తెలియడం లేదు.

తవాంగ్ వీడియో ఇదే అంటూ ప్రచారం
కాగా, పలువురు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌ల్లో ఈ వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌ లోని తవాంగ్‌లో భారత సైన్యం తన ప్రతాపాన్ని చూపించిందని, చైనా సైనికులను తరిమి కొట్టిందని పోస్టులు పెడుతున్నారు. భారత సైన్యం పరాక్రమం అంటూ చాలామంది కీర్తిస్తున్నారు.

పాత వీడియో అంటూ ఫ్యాక్ట్ చెక్‌లు
అయితే, ఈ వీడియో తవాంగ్‌లోనిదేనని, కాకపోతే డిసెంబర్ 9వ తేదీన జరిగిన ఘర్షణది కాదు అని పలువురు జర్నలిస్టులు, నిపుణులు ట్వీట్లు చేస్తున్నారు. భారత సైన్యం, చైనా వ్యవహారాలపై వార్తలు రాసే జర్నలిస్టులు సైతం ఇది తాజా ఘర్షణకు సంబంధించిన వీడియో కాదని చెబుతున్నారు. బహుశా ఇది 2020లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో అయి ఉంటుందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. కాగా, తవాంగ్ ఘర్షణకు సంబంధించిన వీడియో అంటూ ఇంకా కొన్ని వీడియోలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యానికీ, చైనా పీఎల్ఏ సైనికులకు మధ్య అప్పుడప్పుడూ చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

భారత్, చైనా ఎల్ఏసీ ఏంటి?
భారత్ చైనా మధ్య 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. కానీ, హిమాలయ పర్వతాల్లోని ఈ సరిహద్దుకు చాలా చోట్ల స్పష్టమైన హద్దులు, గుర్తులు లేవు. దీంతో ఇరు సైన్యాల మధ్యా తరచుగా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. 1914లో బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలోనే టిబెట్‌కు భారత్‌కు మధ్య సరిహద్దు ఒప్పందం జరిగింది. కానీ, టిబెట్ కూడా తమదేనని, ఈ ఒప్పందంలో తాము భాగం కాదు కాబట్టి దానిని తాము అంగీకరించేది లేదని చైనా అంటుంది. ఈ వివాదం నేపథ్యంలోనే పశ్చిమాన ఉన్న అక్సాయ్ చిన్, తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమవేనని చైనా ప్రచారం చేసుకుంటూ ఉంటుంది.

ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్.. ఎల్ఏసీని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ, దీనికి కూడా స్పష్టమైన గుర్తులు లేకపోవడంతో వివాదాలు కామన్ అయిపోయాయి.

ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎస్సై.. ఆధారాలు లేకుండా నోట్ల కట్టలు నోట్లో కుక్కుకుని..!

Exit mobile version