Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అతని ముక్కుకు గాయమవడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
ముక్కుకు ఆపరేషన్..(Shah Rukh Khan)
షారూఖ్ ఖాన్ తను నటిస్తున్న చిత్రం షూటింగ్ సందర్బంగా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నాడు.అయితే సెట్స్ లో ప్రమాదానికి గురవడంతో అతని ముక్కుకు గాయమయి రక్తస్రావం ప్రారంభమైంది. దీనితో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖాన్ కు చిన్న శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని వైద్యులు అతని బృందానికి తెలియజేశారు. ఆపరేషన్ తర్వాత, షారూఖ్ ఖాన్ తన ముక్కుకు కట్టుతో కనిపించాడు. ఇప్పుడు అతను భారత్ కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నాడని షారూఖ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో, షారుఖ్ ఖాన్ పఠాన్‌తో పెద్ద తెరపై అద్భుతమైన పునరాగమనం చేశాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె మరియు జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అందరి నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
త్వరలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. షారుఖ్ ఖాన్, నయనతార మరియు విజయ్ సేతుపతి ప్రతిభతో అట్లీ కుమార్ దర్శకత్వ మేళవింపుతో జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భావోద్వేగాలు, యాక్షన్ మరియు గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్‌తో నిండిన ఆకట్టుకునే కథనంతో చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.ఇది కాకుండా, షారుక్ ఖాన్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం లో డుంకీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో షారూఖ్ సరసన తాప్సీ నటించనుంది. ఈ ఏడాది చివర్లో డుంకీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.ఇవి కాకుండా, సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ 3 లో కూడా షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.