IIIT: రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ విద్యాలయాల్లో మొత్తం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. అది కూడా పీయూసీ రెండు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాల చొప్పున ఉంటుంది. అక్టోబరు 12, 13 తేదీల్లో నూజివీడు,ఇడుపులపాయ, 14,15న ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడుపులపాయలో, 15,16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఎచ్చెర్లలో జరుగనున్నట్టు ఆర్జీయూకేటీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ప్రభుత్వ పథకాలకు (విద్య, వసతి దీవెన) అర్హత లేని వారు పీయూసీలో సంవత్సరానికి రూ.45 వేలు, ఇంజినీరింగ్‌లో సంవత్సరానికి రూ.50 వేల చొప్పున ప్రతి విద్యార్థి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే నిబంధనలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు నెలకు రూ.2,500 నుంచి రూ.3000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ ఫీజు రూ.1000, (ఎస్సీ, ఎస్టీలు రూ.500), గ్రూపు బీమా కింద రూ.1,200, కాషన్ డిపాజిట్ రూ.1000, హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజు రూ.1000 కట్టాల్సి ఉంటుంది.
కౌన్సిలింగ్ కు వచ్చే విద్యార్థులు సంబంధిత బోర్డు జారీ చేసిన ఎస్‌ఎస్‌సీ/తత్సమాన పరీక్ష సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, తాజా ఈడబ్ల్ల్యూఎస్, ప్రత్యేక విభాగాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలు. పాస్‌పోర్ట్ ఫొటోలును తీసుకుని హాజరవ్వాలని ఆర్జీయూకేటీ తెలిపింది. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ను https://rgukt.in/ సంప్రదించాలని సూచించింది.
ఇదీ చదవండి: గ్రూప్-1 పరీక్షల్లో కొత్త మార్పులు.. ఈ సారి అన్నీ జంబ్లింగే..!