Site icon Prime9

Indonesia: 10 గంటల్లో 62 సార్లు.. 162 మంది మృతి

strong-earthquake-kills-162 people-in-indonesia

strong-earthquake-kills-162 people-in-Indonesia

Earthquake in Indonesia: ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించి తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జావాలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. ఈ ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో పలుమార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 9.16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం పలు భవనాలను నేలమట్టం చేసింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. దాదాపు 15 సెకన్లపాటు భూమి కంపించడంతో జావా ద్వీపం వణికిపోయింది.

భూకంపం కారణంగా 162 మంది మరణించినట్టు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. 700 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి సియాంజుర్‌లో ఓ స్కూలు, ప్రాంతీయ ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, ఓ ప్రార్థనా మందిరం, మూడు పాఠశాలల గోడలు కుప్పకూలాయి. వందల సంఖ్యలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరగడానికి వరుస భూ ప్రకంపనలే కారణమని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రులు ధ్వంసం కావడంతో వీధుల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిఫా ప్రపంచ కప్.. ఖతర్ లో జాకీర్‌ నాయక్‌ ప్రసంగాలు

Exit mobile version