Site icon Prime9

Drishyam Style Murder: ప్రేమకు అడ్డుచెప్పాడని ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది..

murder

murder

Karnataka: కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.

బెళగావికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్‌ కాంబళె (57) ఇటీవల హత్యకు గురయ్యారు. గతంలో దుబాయ్‌లో పని చేసిన సుధీర్ ప్రస్తుతం తన భార్య రోహిణి, కుమార్తె స్నేహతో కలిసి బెళగావీలో ఉంటున్నాడు. స్నేహ పుణెలో చదువుతుండగా అక్షయ్‌ విఠకర్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. కుమార్తె ప్రేమ వ్యవహారం సుధీర్‌‌కు ఇటీవలే తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో తండ్రి పై కోపాన్ని పెంచుకున్న స్నేహ అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె కూడా హత్యకు ప్రోత్సహించింది. దీనితో ప్రియుడు అక్షర్‌ను పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న రప్పించి ఓ లాడ్జిలో ఉంచింది. సుధీర్ తన ఇంటిలోని పై అంతస్తులో నిద్రపోతుండగా సెప్టెంబరు 17 తెల్లవారుజామున అక్షయ్‌ను తల్లీకూతుళ్లు ఇంటికి పిలిపించారు. సుధీర్‌ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా, అక్షయ్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.

మరోవైపు సుధీర్ భార్య పిర్యాధుతో కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. విచారణలో పోలీసులు ఎలా అడిగినా ఇద్దరూ ఒకేరకమైన సమాధానాలు చెప్పడంతో అవాక్కయ్యారు. అనుమానంతో తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. హత్యను తామే చేసినట్టు, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసినట్లు విచారణలో ఒప్పుకొన్నారని పోలీసులు వివరించారు. నిందితులు రోహిణి కాంబళె, స్నేహ, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version