Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
సహజీవనం చేస్తూ.. చంపేశాడు (Delhi Crime)
నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్.. హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. వీరికి 2018లో ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత సహజీవనం చేస్తున్నారు. వీరి ఇళ్లలో తెలియకుండా.. దిల్లీలో సహజీవనం చేస్తున్నారు. అయితే త్వరలో.. నిక్కీ యాదవ్ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇదే సమయంలో.. సాహిల్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయాన్ని సాహిల్ నిక్కి యాదవ్ కు చెప్పకుండా దాచిపెట్టాడు. చివర్లో పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ గెహ్లాట్ ను నిలదీసింది. తనను కాదని.. మరొకరిని పెళ్లాడితే బాగొదని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9న సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం అయింది.
చంపేసి ఫ్రిజ్ లో దాచేశాడు..
ఈ విషయంపై మాట్లాడాలని సాహిల్ ని నిక్కి కోరింది. మరో యువతిని పెళ్లి చేసుకోవద్దని ఒత్తిడి చేసింది. అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవా వెళ్లడానికి.. నిక్కి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని సాహిల్ ని కోరింది. దీనికి సాహిల్ నిరాకరించాడు. విసుగు చెందిన నిక్కి.. తనను ప్రేమించి ఇంకొకరిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసింది. ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన గెహ్లాట్.. మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహన్ని.. తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్‌లో దాచి పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాతి రోజు.. వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
వేరే యువతిని వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని.. దానివల్లే ఇలా జరిగిందని నిందితుడు పోలీసులు విచారణలో వెల్లడించారు. సహజీవనం చేయడం ఈ కాలంలో ఎక్కువైందని.. ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు.