Sankranti Special Buses: తెలుగు ప్రాంతాల్లో సంక్రాంతి పండుగగు ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇంక ఇదే పెద్ద పండుగ అని చెప్పాలి. దేశవిదేశాల్లో ఉన్నవారు సైతం ఈ పండుగగు తమ సొంత ఊరికి పయనమవ్వాలని చూస్తారు. ఇలా వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ బ్రతుకు దెరువుకోసం పొరుగు రాష్ట్రాలు దేశాలకు వెల్లినవారంతా తమ స్వగ్రామానికి చేరుకోవడం చూస్తుంటాము. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో రవాణా సర్వీసులన్నీ వివిధ ప్రాంతాలకు అదనపు వాహనాలను కేటాయిస్తాయి. కాగా ఈక్రమంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
గతేడాది సంక్రాంతి పండుగగు టీఎస్ ఆర్టీసీ 3,736 బస్సులు ఏర్పాటు చేయగా, ఈసారి మరో పది శాతం బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు, వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ రిజర్వేషన్ ను కూడా 60 రోజుల ముందుగానే చేసుకునే వెసులుబాటును కల్పించింది. గతంలో ఈ రిజర్వేషన్ సదుపాయం నెల రోజుల ముందు మాత్రమే ఉండేది. కానీ ఈ సంవత్సరం రెండు నెలలకు పెంచింది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ సదుపాయం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ బస్సులు జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు వాటిలో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
ఇదీ చదవండి: నన్ను ఈ చొక్కా అయినా వేసుకోనిస్తారా వైసీపీ?.. వారాహి కలర్ పై స్పందించిన పవన్