Train Hijack: ఆంధ్రప్రదేశ బార్డర్ సమీపంలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవాడ- కిరండూల్ సెక్షన్‌లో వెళ్తోన్న రైలును మావోలు హైజాక్ చేశారు. కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
బచెలి–భాన్సీ బ్లాక్ సెక్షన్ 433 కి.మీ సమీపంలో మావోలు రైలును హైజాక్ చేశారు. గూడ్స్ వెళ్లే ట్రాక్ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకుని ట్రాక్‌కి అడ్డంగా నిలబడ్డారు. రెడ్ క్లాత్ చూపుతూ… ట్రైన్‌ని నిలిపివేయాలని ఆదేశించారు.
అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలుని ఆపారు. ట్రైన్‌లోకి మారణాయుధాలతో వచ్చి డ్రైవర్, ఇతర సిబ్బంది, మరియు గార్డ్ నుంచి తమ అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న వాకీ టాకీలను లాగేసుకున్నారు.
కొందరు మావోయిస్టులు ట్రాక్‌పై కాపలా కాయగా.. మరికొంతమంది లోకోమోటివ్‌కి బ్యానర్ కట్టారు. అనంతరం వారికి సంబంధించిన కొన్ని కరపత్రాల్ని గూడ్స్ రైలు సిబ్బందికి ఇచ్చి వాటిని దంతేవాడలో పంపిణీ చెయ్యాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయారు. దానితో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది.
దీనిపై స్పందించిన విశాఖపట్నం జిల్లా వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి ఆ సెక్షన్ పరిధిలో రాకపోకలు జరిపే మిగిలిన రైళ్లను నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించి మావోలను గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి.. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్‌ఎం తెలిపారు. కాగా మావోయిస్టులు ఆ కరపత్రాల్లో సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాలను దేశమంతా నిర్వహిస్తున్నామని, ఆ వేడుకలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Viral News: కుక్కను కారుకు కట్టేసి ఊరంతా తిప్పిన వైద్యుడు… వీడియో వైరల్