Gaza Incident: ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. వేడుకలకు హాజరయ్యి 21 మంది సజీవదహనం అయ్యారు. అందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆవేదనకరం. ఈ దుర్ఘటన పాలస్తీన గాజాలోని శరణార్థుల శిబిరంలో చోటుచేసుకుంది.
గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్ట్ మెంట్లో గురువారం రాత్రి అబురయా అనే వ్యక్తి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. కాగా ఆ ఆనందం మొత్తాన్ని ఓ అగ్నిప్రమాదం నాశనం చేసింది. ఈ అగ్నిప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని సజీవదహనం చేసింది. అపార్ట్మెంట్లో మంటలు విస్తరించి 21 మంది సజీవ దహనం కాగా, వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మూడు అంతస్తులున్న ఓ భవనంలోని పైఅంతస్తులో అబురయా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకను ఆనందంతో అందరూ కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం.
అయితే, పెట్రోల్ నిల్వ చెయ్యడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. కాగా బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది.
ఇదీ చదవండి: సహజీవనం చేస్తున్న మహిళను 35 ముక్కలుగా నరికి అడవిలో పడేసాడు..