Megastar Chiranjeevi Birthday Special: ఆయన జీవితంలోని ప్రతి పేజీ ఎందరో నటులకు ఆదర్శం. కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా తన జీవితంలో పోషించిన ప్రతి పాత్ర ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది. పట్టుదలతో అంచెలంచెలుగా పైకెదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎందరికో స్పూర్తి దాయకం. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి పేరు వినగానే స్వయంకృషి గుర్తొస్తుంది. కృషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారాయన. ఆ కృషితోనే జీవితంలో ఎన్నో మైలు రాళ్లను దాటారు. సక్సెస్ సాధించడానికి చిరంజీవి పడిన తపన, చేసిన కృషి, పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గెస్టు ఆర్టిస్టు నుంచి మొదలుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హాస్య నటుడిగా, ఇలా పలు పాత్రలు పోషించి భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ఆగష్టు 22, 1955 న ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలోనే ఆయన ఎన్.సి.సి లో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్ లో పాల్గొన్నారు. చిరంజీవికి చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో కామర్స్‌లో డిగ్రీ పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరారు. అక్కడే ఆయన నటనలో శిక్షణ పొందారు.మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత తన మొదటి సినిమా పునాది రాళ్లు సినిమాలో నటించారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. అనంతరం ఆయన తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించారు. 1979లో నిర్మించిన ఐ లవ్ యు చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించారు. అలాగే ప్రసిద్ధ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో కూడా చిరంజీవి ప్రతినాయకుడిగా నటించారు. ఆ తర్వాత 1980 దశకంలో చిరంజీవి నటించిన సినిమాలు ఆయనకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. 1983లో వచ్చిన ఖైదీ ఆయన సినీ కెరీర్ ను ఒక మలుపు తిప్పింది.
ఇక 90ల ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ పీక్స్‌కు చేరింది. వరుస బ్లాక్ బస్టర్స్ చిరును తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా వంటి చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. దీంతో చిరంజీవి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కోసం నిర్మాతలు క్యూకట్టేవారు. ఆ సమయంలో చిరంజీవి రెమ్యూనరేషన్ దేశంలోనే హైయెస్ట్ కి చేరుకుంది. కెరీర్ మొదట్లో వెయ్యి నూట పదహారు రూపాయలు పారితోషికం అందుకున్న చిరంజీవి ఆ తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుడుగా చరిత్ర సృష్టించారు. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో బిగ్గర్ ధ్యాన్ బచ్చన్, ద న్యూ మనీ మెషీన్, శీర్షికలతో 1992 సంవత్సరంలో ఆర్టికల్స్ ప్రచురితమవడంతో చిరంజీవి చరిష్మ దేశానికి తెలిసింది. అప్పట్లో మెగాస్టార్ అందుకున్న రెమ్యునరేషన్ రూ.1.25 కోట్లని సమాచారం. అమితాబ్ బచ్చన్ కి కూడా అంత పారితోషికం లేదు. ఆ సమయంలో షారుక్, సల్మాన్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. అమితాబ్ అప్పటికే దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఉన్నారు.
149 చిత్రాల్లో స్టార్ కథానాయకుడిగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి ప్రవేశించారు చిరు. 2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతో ఆయన నటనకు దూరమయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రిగా సేవలందించారు. మధ్యలో మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు. ప్యాన్స్ కోరిక మేరకు, మళ్లీ నటించాలనే తపన ఆయనలో ఉండటం వల్ల ఖైదీ నంబరు 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అదే స్టైలు అదే జోరు అంటూ ఈ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఆచార్య చిత్రంలో కుమారుడు రామ్ చరణ్ తో కలిసి నటించి అభిమానులను మైమరిపించారు. నటుడిగానే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా కూడ చిరంజీవి ప్రజలకు దగ్గరయ్యారు. చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంకులను స్దాపించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ చేసారు. షూటింగులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చిత్రపరిశ్రమలోని టెక్నీషియన్లు, ఇతర వర్గాల ప్రజలకు మూడు నెలల పాటు రేషన్ పంపిణీ చేసారు. అంతేకాదు లక్షలాది రూపాయలు తన స్వంత డబ్బు వెచ్చించి ఎంతోమందిని ఆదుకున్నారు. ఇటీవల టాలీవుడ్ లో టిక్కెట్ ధరల సంక్షోభం నేపధ్యంలో ఏపీ సీఎం జగన్ తో సమావేశమయి సమస్య పరిష్కారానికి కీలక పాత్ర పోషించారు. పరిశ్రమలో ఎవరి చిత్రం విజయవంతం అయినా అభినందించడంలో నటీనటులను ప్రోత్సహించడంలో మెగాస్టార్ ముందుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కు ఆయనే పెద్దదిక్కు అంటే అతిశయోక్తికాదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.