Site icon Prime9

AP Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య వార్తలు.. సీఎం జగన్ టూర్, టెన్త్ రిజల్ట్స్, యాక్సిడెంట్స్, తదితర వార్తలు..

ap latest news on april 26 2023

ap latest news on april 26 2023

AP Latest News : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య వార్తల సమాహారం మీకోసం ప్రత్యేకంగా..  వీటిలో ముందుగా ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ తిరుపతిలో మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నారు..  కడప ఎంపీ అవినాశ్ రెడ్డి  నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా నేడు ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు, వైజాగ్ ఆర్కే బీచ్ లో యువతి మృతదేహం లభ్యం.. ఏపీలో స్కూళ్లకు సెలవుల ప్రకటన.. తదితర వార్తలు…

పర్యటనలు (AP Latest News)..

సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన..

ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు.

తిరుపతి జిల్లాకు గవర్నర్..

తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని సాయంత్రానికి తిరుమలకి చేరుకుంటారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.

కడపలో అవినాశ్ రెడ్డిపర్యటన..

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బుధవారం కడప, మైదుకూరు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. మరోవైపు వివేకా హత్యకేసులో ఆయనకు ముందస్తు బెయిల్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నేడు తుదితీర్పు ఇవ్వనున్నారు.

(AP Latest News) తాజా వార్తలు..

తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు.. మండిపడుతున్న భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు.. 

తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ అయిన తిరుమల కొండ మీద నుంచి ఏకంగా 3 హెలికాప్టర్లు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ మూడు హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. కాగా, ఇది కావాలని చేసిన పని కాదని.. తిరుమల నో ఫ్లయ్ జోన్ అనే సమాచారం వారికి లేకపోవడం వల్లనే హెలికాప్టర్లు ఆ దారి వెంబడి ప్రయాణించాయని అధికారులు చెబుతున్నారు. తిరుమలను నో ఫ్లయ్ జోన్ గా ఎప్పుడో ప్రకటించారని, ఆలయం మీదుగా హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ప్రయాణం చేయకూడదనే నియమం ఎప్పటి నుంచో ఉందని, అయినా ఇప్పుడిలా హెలికాప్టర్లు ప్రయాణం చేయడం ఏంటని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు మండిపడుతున్నారు. తిరుమల కొండపై విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడం నిషేధం. అలానే డ్రోన్లు ఎగరేయడం కూడా నిషేధమే.

నేడు ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు ..

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విజయవాడలో బుధవారం సాయంత్రం ఐదింటికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ విడుదల చేస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.

29 నుంచి ఏపీలో స్కూళ్లకు సెలవులు ..

రాష్ట్రంలో స్కూళ్లకు ఈనెల 29 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చివరిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వైజాగ్ ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యం.. 

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పెద గంట్యాడ కు చెందిన శ్వేత గా గుర్తించారు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇటీవల న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంతలోనే మృతదేహం లభ్యమవ్వడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యువతి చనిపోయిన తర్వాత అర్ధరాత్రి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో యువతి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐపీఎల్ బెట్టింగ్.. అప్పు తీర్చలేక యువకుడి సూసైడ్.. 

అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు తాగిన మధుకుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు..

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఒకేసారి 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న చాలా మంది అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీ తర్వాత డీఎస్పీ‌ల బదిలీలు చోటు చేసుకోవడం గమనార్హం.

ప్రమాదాలు (AP Latest News)..

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుంగనూరు కు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవి‌గా గుర్తించారు.

కాకినాడలో విషాదం.. ప్రమాదంలో పెళ్ళి చేసుకోబోతున్న యువ జంట మృతి..  

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్(25)కు కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన దుర్గా భవాని (18) మే 10 న పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలోనే నిన్న(మంగళవారం) రాజ్ కుమార్, దుర్గా భవాని సరదాగా బయటకు వెళ్లాలని అనుకున్నారు. బైక్ పై తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి బయలుదేరారు. అయితే దారి మధ్యలో వీరి బైక్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువ జంట మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

 

Exit mobile version