Congress Bus Yatra: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు.
బస్సు యాత్ర షెడ్యూల్..(Congress Bus Yatra)
మొదటిరోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు, రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుందని టిపిసిసి రేవంత్ రెడ్డి చెప్పారు. మొదటి రోజు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో పాదయాత్ర నిర్వహించనున్నారు. రెండవరోజు రామగుండం లో రాహుల్ గాంధీ సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ, యూనియన్ నాయకులు, ఆర్ఎఫ్ సి ఎల్ కార్మికులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమయి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రైతులతో సమావేశమయి రాత్రికి పెద్దపల్లికి చేరుకుంటారు. రాహుల్ మూడవరోజు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. సాయంత్రం చెరకు, పసుపు రైతులతో సమావేశమయి వారి సమస్యలను తెలుసుకుంటారు. బస్సు యాత్రలో భాగంగా రాహుల్ బీడీ కార్మికులు మరియు గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలను కూడా రాహుల్ కలుసుకుంటారు.
కాంగ్రెస్ లో చేరికలు..
ఇలా ఉండగా మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలానికి చెందిన కార్యకర్తలు కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్ లతో పాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన భార్య పూజిత కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరిని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.