Telangana Congress: టి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ దక్కనివారు నేరుగా గాంధీ భవన్‌నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో రోజూ గాంధీ భవన్ గేట్లకి తాళాలు వేస్తున్నారు. తాజాగా గాంధీ భవన్ వద్ద భద్రతని పెంచారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులని రంగంలోకి దించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసాన్ని కూడా కార్యకర్తలు, నేతలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో రేవంత్ నివాసం వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. అవసరం ఉంటే తప్ప ఇతరులని గాంధీ భవన్‌లోకి పోలీసులు అనుమతించడం లేదు.
రాజీనామా చేస్తానన్న దామోదర రాజనర్సింహ..(Telangana Congress)
మరోపక్క మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో దామోదర అనుచరులు ఎవరికీ టికెట్ రాకపోవడంతో రాజనర్సింహ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్‌కి టికెట్ అడిగితే అక్కడ నీలం మధు ముదిరాజ్‌కి టికెట్ కేటాయించారు. నర్సాపూర్ టికెట్‌ని గాలి అనిల్ కుమార్‌కివ్వాలని అడిగితే అడగగా రాజిరెడ్డికిచ్చారు. నారాయణ ఖేడ్‌లో సంజీవ్ రెడ్డికి టికెట్ అడగితే సురేష్ షెట్కార్ పేరు ప్రకటించారు… ఎల్లారెడ్డి నుండి సుభాష్ రెడ్డికి టికెట్ అడగగా మదన్ మోహన్ రావుకివ్వడంతో దామోదర రాజనర్సింహ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేస్తానని దామోదర రాజనర్సింహ వార్నింగ్ ఇచ్చారు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని టికాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే ఫోన్ చేసి దామోదర రాజనర్సింహని సముదాయించారని సమాచారం.
తనకు వనపర్తి టికెట్‌ని ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం పట్ల మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టిపిసిసితో తాడోపేడో తేల్చుకునేందుకు చిన్నారెడ్డి తన అనుచరులతోపాటుగా గాంధీ భవన్‌కి చేరుకున్నారు.