Kaushik Reddy’s comments: మీరు గెలిపించకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకి రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. తక్షణమే ఈ వ్యాఖ్యలపై స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కౌశిక్ రెడ్డి తనకి ఓటేయాలంటూ అడిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గెలిపిస్తే జైత్రయాత్ర.. లేకుంటే శవయాత్ర..(Kaushik Reddy’s comments)
ఎన్నికల ప్రచారంలో చివరిరోజయిన మంగళవారం కౌశిక్ రెడ్డి ఓటర్లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.నన్ను గెలిపిస్తే 3వ తేదీన జైత్రయాత్రకి వస్తారు.లేదంటే 4వ తేదీన మా కుటుంబ సభ్యుల శవ యాత్రకు వస్తారని కౌశిక్ రెడ్డి అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు దండం పెడతాను.మీరు గెలిపించకపోతే మా ముగ్గురి శవాల్ని చూస్తారని కౌషిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.కౌశిక్ రెడ్డి 2018లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఈటల రాజేందర్బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సమయంలో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అపుడు సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి నిచ్చారు.హుజూరాబాద్‌కు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్దిగా గెల్లు శ్రీనివాస యాదవ్ పోటీ చేసి ఈటల రాజేందర్ చేతితో ఓడిపోయారు. ఇపుడు తాజా ఎన్నికల్లో ఈటల పై బీఆర్ఎస్ అభ్యర్దిగా కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.