Pawan Kalyan:తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం వరంగల్‌లో బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారు. ఈ సందర్బంగా హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరై ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో కమీషన్ల రాజ్యం..( Pawan Kalyan)
పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలు తనకు స్పూర్తినిచ్చాయని పవన్ అన్నారు. తన వద్ద ధనబలం లేకపోయినా గుండెబలాన్ని తెలంగాణ నుంచే నేర్చుకున్నానని దానితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నానని చెప్పారు. తెలంగాణలో జనసేన ఉంటుంది. ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తాం. ఎందరో అమరవీరుల బలిదానాలు, త్యాగాలే జనసేనను ముందుకు నడిపిస్తున్నాయని పవన్ అన్నారు.2009లో సామాజిక తెలంగాణ కావాలని గద్దర్‌తో చర్చించానని అన్నారు. 2009 నుండి తట్టుకుని నిలబడడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణంయువత భవిష్యత్తు కోసం జనసేన పోరాడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు నన్ను కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగుపెడతానని చెప్పానని పవన్ గుర్తు చేసారు. తెలంగాణ అంటేనే పోరాటానికి కేరాఫ్ చిరునామా అని అటువంటి తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందన్నారు. తెలంగాణలో అవినీతి రహిత రాజ్యం రావాలన్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ అన్నారు. బీసీ ని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఈ విషయంలో బీజేపీకిజనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్‌లకు ఓటేసి గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.