Google Sundar Pichai: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. ఈ కోతలు గత ఏడాది ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగుల ఉద్వాసనలు మరింత పెరిగాయి. ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు దేశంలోని పలు టెక్ కంపెనీలు ఇదే బాటలో వెళుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాల కోతలు విధించింది.
ఈ క్రమంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2022 ఏడాదిగాను సుందర్ 226 మిలియన్ల డాలర్ల( అంటే భారత కరెన్సీలో రూ. 1850 కోట్లు) పారితోషికం అందుకున్నారనే వార్తలు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మేరకు ఆల్భాబెట్ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించింది. సుందర్ పారితోషకంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నాయి. ఈ పారితోషకం ప్రకారం గూగుల్ లో ఉద్యోగి జీతం కంటే దాదాపు 800 రెట్టు ఎక్కువ.
సుందర్ పిచాయ్ ఈ స్టాక్ అవార్డ్స్ ను 3 ఏళ్ల కాలానికి అందుకున్నారు. 2019 లో కూడా సుందర్ ఈ స్థాయిలోనే ప్యాకేజీ తీసుకున్నారు. 2019లో స్టాక్ అవార్డుల రూపంలో ఆయనకు 281 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకునన్నారు. అదే విధంగా గత మూడేళ్లుగా పిచాయ్ స్థిరంగా 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
కాగా, గూగుల్ ఈ ఏడాది జనవరిలో ఖర్చు నియంత్రణలో భాగంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. దీంతో ఈ నెల లో లండన్ లోని గూగుల్ ఉద్యోగులు నిరసన బాటపట్టారు. అంతకుముందు మార్చిలో కంపెనీకి చెందిన జ్యూరిచ్ ఆఫీసుల్లోనూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పిచాయ్ భారీ స్థాయిలో పారితోషకం అందుకోవడం ఇపుడు చర్చకు దారితీసింది.