wrestlers: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత్ స్టార్ రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం.. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి గా వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ పోలీసులకు నోటీసులు(wrestlers)
లైంగిక ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు ఈ షిటిషన్ ను దాఖలు చేశారు. రెజ్లర్ల తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నా బ్రిజ్ భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించింది.
వేధింపుల వీడియో రికార్డింగ్ లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్న ఆధారాలు ఉన్నా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులకు సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. ఈ పిటిషన్ పై శుక్రవారం మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అదే విధంగా ఈ కేసులో ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడిషియల్ రికార్డుల నుంచి 7గురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆగిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
కాగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పర్యవేక్షక కమిటీ విచారణ చేపట్టింది. అయితే కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ గతవారం నుంచి స్టార్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మళ్లీ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేంత వరకు తాము నిరసన విరమించమని వారు స్పష్టం చేశారు. మరోవైపు రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో మే 7వ తేదీన జరగాల్సిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను కూడా క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపివేసింది.