IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఓ దశలో విజయం దిశగా సాగుతున్న మ్యాచ్ లో వెనువెంటనే వికెట్లు పడ్డాయి.
ఈ మ్యాచ్ లో మరోసారి సూర్య కుమార్ డకౌట్ గా వెనుదిరిగాడు.
సిరీస్ విజేతను తేల్చే చివరి మ్యాచ్ లో టీమిండియా పోరాడుతోంది. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయాయి. ప్రస్తుతం క్రీజులో హర్దీక్ పాండ్యా, రవీంద్ర జడేజా కొనసాగుతున్నారు. మ్యాచ్ ఆరంభంలో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జోరుమీదున్న రోహిత్ ను అబాట్ ఔట్ చేశారు. రోహిత్ శర్మ.. 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ కోహ్లికి సహకారం అందించారు. రోహిత్ ఔటైన కాసేపటికే.. గిల్ ఔటయ్యాడు.
కేఎల్ రాహుతో ఇన్నింగ్స్ ను కోహ్లీ నడిపించాడు. జంపా బౌలింగ్ లో కెఎల్ రాహుల్ ఔట్ అవ్వగానే.. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
దీంతో భారత్ కష్టాల్లో పడింది. ఓ దశలో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 54 పరుగులతో జట్టును విజయం వైపు దిశగా తీసుకెళ్లాడు. కానీ కోహ్లీ ఔటైన తర్వాతి బంతికే సూర్య కుమార్ మరోసారి డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో సూర్య డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.
అంతకముందు ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది.
మెుదటి వికెట్ కు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించారు.
ఓపెనర్ల జోడిని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో.. ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితవుతుందని అనుకున్నారు.
కానీ చివర్లో స్టోయిన్సన్, అలెక్స్ కేరీ రాణించడంతో ఆసీస్ మంచి స్కోర్ సాధించింది.
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్మిత్ మినహా ప్రతి ఆటగాడు.. తలో చేయి వేయడంతో ఆసీస్ 269 పరుగులు చేయగలిగింది.
భారత బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఇక మొదటి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో వన్డేలో ఓటమిపాలై డీలాపడింది.