Site icon Prime9

MI vs LSG : ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోను చిత్తు చేసిన ముంబై.. రికార్డులన్నింటిని తిరగరాసేశారుగా !

MI vs LSG eliminator match highlights in ipl 2023

MI vs LSG eliminator match highlights in ipl 2023

MI vs LSG : ఐపీఎల్ 2023లో భాగంగా కప్ కొట్టడానికి మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఫైనల్ కి చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఈ పోరులో లక్నో జట్టుపై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సీజన్‌ను వరుస ఓటములతో మొదలుపెట్టి, ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని.. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించి అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది.

మరి ముఖ్యంగా ఈ మ్యాచులో ముంబై బ్యాటరూ ఎవరూ హాఫ్ సెంచరీ చేయకుండానే (MI vs LSG) ముంబై స్కోరు 182/8గా నమోదైంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ ల చరిత్రలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా జట్టు 180 పరుగులు దాటడం ఇదే మొట్ట మొదటిసారి కావడం గమనార్హం. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16.3 ఓవర్లలోనే 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్కోరు 23 పరుగులు చేరుకునే సరికే ఓపెనర్లు కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్ ఇంటి బాట పట్టారు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ కాసేపు క్రీజులో నిలబడ్డారు. స్టోయినిస్ వేగంగా ఆడగా, తనది కాని ప్లేస్‌లో వచ్చిన కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు.

కృనాల్ పాండ్యాను పీయూష్ చావ్లా అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఆయుష్ బడోని, డేంజరస్ నికోలస్ పూరన్‌లను ఆకాష్ మధ్వాల్ ఒకే ఓవర్లో అవుట్ చేసి లక్నోను చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత లక్నోలో రనౌట్ల పర్వం మొదలైంది. మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతం, దీపక్ హుడా ముగ్గురూ ఘోరంగా రనౌటయ్యారు. రవి బిష్ణోయ్, మొహ్‌సిన్ ఖాన్‌లను మధ్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 101 పరుగులకే లక్నో ఆలౌట్ అయ్యింది. ఈ టీమ్ లో స్టోయినిస్ ఒక్కడే 27 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించాడు. లక్నో జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ అవ్వడం గమనార్హం. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 5 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ జోర్డాన్, పియూశ్ చావ్లా తలో వికెట్ తీశారు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినా.. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (41 పరుగులు, 23 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (33 పరుగులు, 20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఒక దశలో 200 పైచిలుకు స్కోరు చేసేలా ముంబై టీమ్ ప్రతిభ కనబరిచింది. అయితే, జోరు మీదున్న సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్‌ను లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్.. ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 4 ఓవర్లు వేసి 38 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. మోసిన్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది. ముంబై జట్టులో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ తర్వాత తిలక్ వర్మ 26 పరుగులు (22 బంతుల్లో, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ 13) పరుగులు చేశారు. చివర్లో నేహల్ వధేరా (12 బంతుల్లో 23 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ముంబై జట్టుకు భారీ స్కోరు దక్కింది. ఈ విక్టరీతో మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై తలపడనుంది.

Exit mobile version