IPL 2023 RR vs PBKS: ఐపీఎల్ 2023 8వ మ్యాచ్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖీ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. దానితో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.
ఐపీఎల్ మ్యాచ్‌లకు తొలిసారిగా ఆతిథ్యమిస్తోన్న గౌహతిలో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పవచు. చివరి బంతి వరకూ కూడా ఎవరు గెలుస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసి 198 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 60 రన్స్), కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 86 రన్స్-నాటౌట్) క్రీజులో నిలబడి హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అలాగే నాథన్ ఎల్లిస్ గేమ్-ఛేంజింగ్ స్పెల్, ఆల్‌రౌండర్ సామ్ కరన్ బౌలింగ్ కూడా పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ లో ఎల్లిస్ 4 వికెట్లు తీసి ఈ సీజన్‌లో పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడానికి కారణం అయ్యాడనే చెప్పవచ్చు.
ఇకపోతే భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(42), షిమ్రోన్ హెట్మెయర్ (36), ధ్రువ్ జురెల్ (32 నాటౌట్) పోరాడినా రాజస్థాన్ జట్టును గెలిపించలేకపోయారు. అలాగే పడిక్కల్ 21, రియాన్ పరాగ్ 20, బట్లర్ 19 పరుగులు చేశారు. అయినా ఇవేమీ ఎల్లిస్, శామ్ కరణ్, అర్షదీప్ సింగ్ బౌలింగ్ ధాటికి సరిపడలేదు. దానితో రాజస్థాన్ జట్టుకు పరాజయం తప్పలేదు. ఇక ఈ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసి మంచి పర్ఫామెన్స్ కనపరిచినందుకు గానూ పంజాబ్ జట్టు బౌలర్ నాథన్ ఎల్లిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.