KL Rahul: టీమిండియాకు ఎదురుదెబ్బ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరంగా కేఎల్ రాహుల్

బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తా.

KL Rahul: జూన్ 7 న జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23 ఫైనల్ కు టీమిండయా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ తన గాయం ప్రస్తుత పరిస్థితి గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. త్వరలోనే తాను తొడ భాగంలో సర్జరీ చేయించుకోనున్నట్టు వెల్లడించాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. మరో వైపు ఐపీఎల్ 2023 మిగిలిన సీజన్ కు రాహుల్ దూరంగా ఉంటాడు. అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కు కృనాల్ పాండ్య కెఫ్టెన్ గా బాధ్యతలు చేపడతాడు.

 

ఇన్‌స్టాలో రాహుల్ ఏం చెప్పాడంటే..(KL Rahul)

‘బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టమే.. కానీ, ఇదే సరైందని అనుకుంటున్నాను. కీలకమైన సమయంలో లక్నో జట్టును వీడాల్సి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. అయితే, జట్టు సభ్యులు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నా. బయట నుంచి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటా. ప్రతి మ్యాచ్‌ను చూస్తాను.

అదే విధంగా జూన్ 7 న ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా భాగం కాలేకపోతున్నా. అయితే, త్వరలోనే బ్లూ జెర్సీ తో ఆడతానని బలంగా నమ్ముతున్నాను. ప్రస్తుతం మాత్రం గాయం నుంచి కోలుకుని రావడంపైనే దృష్టి పెడుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానుల ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి వస్తా. ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్, బీసీసీఐ, జట్టు సభ్యులు కష్ట సమయాల్లో సపోర్టుగా ఉన్నారు. మీ ప్రోత్సాహంతో ఇంతకుముందు కంటే మరింత ఫిట్‌గా తయారై జట్టుతో కలుస్తా. గాయానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను పంచుకుంటా’ అని కేఎల్ రాహుల్‌ వెల్లడించాడు.

 

గట్టి ఎదురు దెబ్బ

ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపికైన టీమిండియా సభ్యుల్లో గాయాల కారణంగా బుమ్రా, శ్రేయస్ అయ్యర్ దూరం అవ్వగా.. తాజాగా రాహుల్ కూడా గాయం కారణంగా వైదొలగడం టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పోచ్చు. కాగా, జయదేవ్‌ ఉనద్కత్‌ కూడా గాయం కారణంగా ఐపీఎల్‌-2023 నుంచి వైదొలిగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఉనద్కత్‌ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ స్థానంలో టీమ్ లోకి సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకొనే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (ఔట్‌), పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌.