BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఇందుకుగానూ క్వాలిఫైయర్ మ్యాచులు మరియు ఫైనల్ మ్యాచ్ లో ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బోర్డు తీసుకున్న మొక్కల పెంపకం నిర్ణయాన్ని పలువురు హర్షిస్తున్నారు. ఇంకేముంది ఈ నిర్ణయంతో లీగ్ దశలో దుమ్మురేపిన బౌలర్లు కీలకమైన ప్లేఆఫ్స్‌లోనూ తమ తఢాఖా చూపెట్టారు. క్వాలిఫైయర్ మ్యాచ్-1 మ్యాచ్ లో 84 డాట్‌బాల్స్ వేయగా దానితో 42,000 మొక్కలు నాటేందుకు బీజం పడింది. ఇక లక్నో వర్సెస్ ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో సైతం ఏకంగా 96 డాట్‌బాల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో ముంబై యువ పేసర్ ఆకాశ్ మద్వాల్ డాట్ బాల్స్ తో విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఓవర్లకు గానూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్ల పడగొట్టడు. 17 డాట్‌బాల్స్‌తో టాప్‌లో నిలిచాడు. ఈ విధంగా ఆకాశ్ ఆ మ్యాచ్లో ముంబై విజయకేతనం ఎగురవేయడంలో కీలకపాత్ర వహించాడు. దానితో లక్నో జట్టు ఇంటిబాట పట్టింది.
ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో 67 డాట్‌బాల్స్‌ను నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ద్వారా 33,500 మొక్కలు ఖాతాలో చేరాయి. ఇక వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తక్కువగా 45 డాట్‌బాల్స్ నమోదయ్యాయి. దాని ద్వారా మరో 22,500 మొక్కలు జతకలిశాయి. ఇలా లీగ్‌లో మొత్తంగా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో 292 డాట్‌బాల్స్ నమోదు అయ్యాయి. ఒక్కో డాట్‌బాల్‌కు 500ల మొక్కల చొప్పున మొత్తం 292 డాట్‌బాల్స్‌కు 1,46,000 మొక్కలు నాటేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన తెలంగాణ ఎంపీ సంతోషకుమార్ స్వాగతించారు. బీసీసీఐ మొక్కల పెంపు నిర్ణయం భేష్ అంటూ అభినందించారు. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో డాట్‌బాల్స్ ద్వారా మొక్కలు పెంపకాన్ని బోర్డు నిర్ణయం తీసుకోవడం చాలా బాగుంది. ఒక్కో డాట్‌బాల్‌కు 500 మొక్కల చొప్పున దాదాపు లక్షా 47వేల మొక్కలను నాటేందుకు సిద్ధమైన బీసీసీఐకి నాతో పాటు గ్రీన్‌ఇండియా చాలెంజ్ తరఫున హృదయపూర్వక అభినందనలు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మేలు చేయాలన్న మొక్కల పెంపకం ఆలోచన చాలా గొప్పది’ అంటూ ఎంపీ లేఖలో పేర్కొన్నారు.