Dasara: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా దసరాను జరుపుకుంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా కనుమరుగవుతుంది.
దసరా పండుగ రోజు జమ్మిచెట్టు ప్రాధాన్యత ఉంది
పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి ఆయుధాలైన ధనస్సు, విల్లంబులు, గద మొదలగు ఆయుధాలను వెళ్ళే దారిలోని జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి ఆయుధాలను తిరిగి తీసుకుంటారు. అలా వచ్చిన తర్వాత కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు అన్నింటా విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వాహనదారులు , ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఈ రోజు ఆనవాయితీగా కొనసాగుతుంది.
అలాగే మరో పురాణకథ ప్రకారం త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజిస్తాడు. ఆ తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. ఈ విధంగా దసరా రోజున జమ్మిచెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు చూపుకైనా కనిపించడం లేదు. ఏదో దసరా రోజున మాత్రమే జమ్మిచెట్టు కొమ్మలను వెతికి తెచ్చి తూతూ మంత్రంగా తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల జమ్మి చెట్లు కనిపించడం లేదు.
పాలపిట్టలు తగ్గిపోతున్నాయి
దసరా రోజు అసలు పాలపిట్టను ఎందుకు చూడాలనే దానిపైనా పురాణ కథలు ఉన్నాయి. పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి సంకేతంగా కొందరు భావిస్తారు. మరికొంతమంది ఈ పక్షిని పరమేశ్వరుడి స్వరూపంగా చూస్తారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని ప్రజల నమ్మకం. కాగా ఇప్పటి కాలంలో పాలపిట్టలు మచ్చుకైనా కనిపించడం లేదు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం.
ఇదీ చదవండి: వెన్నముద్దల బతుకమ్మ.. జీవితంలో వెలుగులు నింపమ్మ