Ys Bhaskar Reddy: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ని అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పులి వెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలించారు. అనంతరం ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి బీపీ ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం విజయ్ నగర్ లోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసంలో జడ్జి ఎదుట హాజరు పర్చారు. భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాలేదనే విషయాన్ని ఆయన తరపు లాయర్లు.. న్యాయమూర్తికి వివరించారు. వైద్యుల సర్టిఫికెట్లు జైలు సూపరింటెండెంట్ కు ఇవ్వాలని, వైద్యుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించినట్టు వెల్లడించారు. అనంతరం జడ్జి నివాసం నుంచి బాస్కర్ రెడ్డిని అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
సీబీఐ రిమాండ్ లో ఏముందంటే..(Ys Bhaskar Reddy)
కాగా, భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి భాస్కర్ రెడ్డి తరపు లాయర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్ వాళ్లు సోమవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు. భాస్కర్ రెడ్డి పరారయ్యే అవకాశం ఉన్నందున, ఆయనను అరెస్టు చేసినట్టు సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. భాస్కర్ రెడ్డి విచారణకు సహకరించడంలేదని, అందుబాటులోకి లేకుండా పోయే ప్రమాదం ఉందనే అరెస్టు చేశామన్నారు. విచారణను తప్పు దోవ పట్టించేలా భాస్కర్ రెడ్డి జవాబులు ఇచ్చారని తెలిపారు.
వైఎస్ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉందని.. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వీరి మధ్య వివాదం ఉందని పేర్కొన్నారు. హత్యా స్థలంలో ఆధారాలు చెరిపేయడంలో భాస్కర్‌రెడ్డిది కీలక పాత్ర పోషించారన్నారు. నెల ముందే వివేకా హత్యకు కుట్రపన్నారని.. భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర జరిగిందని తెలిపారు. వివేకా హత్యలో సహ నిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందిందని చెప్పారు. సీఐ శంకరయ్యను భాస్కర్‌రెడ్డి బెదిరించారని సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.