Andhra Pradesh: సీఎం జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్‌గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో బీసీలకు ఇక్కట్లు తప్ప ఇంకేమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. అణగదొక్కుతున్న జగన్ రెడ్డిని కీర్తిస్తున్న బీసీ మంత్రులు సిగ్గుపడాలని అన్నారు. 1000కి పైగా నామినేటెడ్ పదవుల్లో బీసీల స్థానం ఎక్కడ? అంటూ ఆయన ప్రశ్నించారు.
బీసీలను బలి తీసుకుంటున్న విజయసాయరెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఏంటని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలోని కీలక పదవుల్లో తెలుగుదేశం పార్టీ బీసీలను నియమించిందని ఆయన గుర్తుచేశారు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తే, ఇప్పుడు మొత్తం రెడ్లే కనిపిస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన ద్రోహం బ్రిటీష్ పాలనలో కూడా జరగలేదని అన్నారు.
బీసీలకు ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపు టీడీపీతోనే వచ్చిందన్నారు. ఆవిర్భావం నుంచి బీసీలంతా టీడీపీకి అండగా నిలిచారని, అందుకే వారి పై వైసీపీ ప్రభుత్వం దాడులకు దిగుతోందని రామకృష్ణుడు ఆరోపించారు. రిజర్వేషన్లను కుట్రపూరితంగా కుదించారని ఆయన దుయ్యబట్టారు.రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు, దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి నియంతృత్వాన్ని సమాధి కట్టడం తథ్యమని యనమల జోస్యం చెప్పారు.