Site icon Prime9

Sharmila: సీబీఐ వద్దకు షర్మిల .. ఇది బీజేపీ వ్యూహమేనా?

Sharmila cbi

Sharmila cbi

Sharmila: తెలంగాణా సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు  తరచూ ఆరోపిస్తున్నాయి. వాటిమీద సీబీఐతో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నాయే తప్ప ఎవరూ సీబీఐని ఇంతవరకూ నేరుగా కోరినది లేదు. అయితే – ఇప్పుడు ఆ పని వై.ఎస్‌. షర్మిల చేశారు. వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత షర్మిల తొలిసారి ఢిల్లీ వెళ్లారు. ఏకంగా సీఎం కేసీఆర్ పై సీబీఐకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ష‌ర్మిల మ‌రో శంక‌ర్ రావు కానుందా అన్న టాక్‌ వినిపిస్తోంది.

వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత – కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్‌ త‌మ మాట విన‌లేద‌ని సరికొత్త వ్యూహం అమలు చేసింది. కాంగ్రెస్‌ నేత శంకర్‌రావుతో జగన్‌పై అక్రమ కేసులు పెట్టించిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీంతో జగన్‌ జైలుపాలయ్యారు. ఇప్పుడు బీజేపీ కూడా ష‌ర్మిలను అలాటి అస్త్రంగానే ఉప‌యోగిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.ఢిల్లీలోని సీబీఐ అధికారుల‌ను క‌లిసిన షర్మిల – సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తుల‌తో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ అవినీతిపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశానని.. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కోరానని ఆమె తెలిపారు. షర్మిల ఫిర్యాదు ఆధారంగా సీబీఐ విచారణ జరుపుతుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38 వేల కోట్ల రూపాయలు మాత్రమే అయితే.. కేసీఆర్ సీఎం అయ్యాక లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని విమర్శించారు. చిన్న చిన్న పనుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు దాకా ఒక్క కాంట్రాక్టు సంస్థకే అప్పగించారని.. ఇదంతా అవినీతిలో భాగమేనని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు స్కూటర్ కూడా లేని సీఎం కేసీఆర్ కు ఇప్పుడు విమానం కొనుక్కునేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని షర్మిల ప్రశ్నించారు.

దీనివెనక బీజేపీ పెద్దలు ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ‌లోని కొందరు ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పంద‌న రాలేదు. అయితే..వైయ‌స్ ష‌ర్మిల విష‌యంలో సీబీఐ కచ్చితంగా స్పందిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బ‌హుశా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రక‌ట‌న త‌ర్వాత మ‌రింత కోపంగా ఉన్న బీజేపీ పెద్దల‌కు ష‌ర్మిల ఫిర్యాదు పెద్ద ఆయుధంగా త‌యారైంది అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శంక‌ర్ రావు ఉప‌యోగించుకున్నట్లు బీజేపీ కూడా ష‌ర్మిలాను ఉప‌యోగించుకోని కేసీఆర్ ను దెబ్బ తియ‌బోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణ‌లో రాజకీయ పార్టీ పెట్టి సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్న ష‌ర్మిలకు పెద్దగా ప్రజాధ‌ర‌ణ లేక‌పోవడం వల్ల కేసీఆర్ కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఏదీ ఏమైనా ష‌ర్మిల ఫిర్యాదును శంక‌ర్ రావు ఫిర్యాదుతో పోల్చడంతో తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద దుమారమే రావచ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. షర్మిల ఫిర్యాదు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రూపకర్త మేఘా సంస్థకు కూడా దెబ్బనే అని భావిస్తున్నారు. ఇక వీరే ఏపీలోనూ పోలవరం కడుతున్నారు. కేసీఆర్‌, జగన్‌కు సన్నిహితంగా ఉన్నారు. సో అన్నయ్య మిత్రుడిని కూడా వైఎస్ షర్మిల తెలంగాణ అవినీతిలో బుక్ చేశారని ప్రచారం సాగుతోంది.

Exit mobile version