Revanth Reddy: రేవంత్ రెడ్డి దూకుడుకు సీనియర్ల చెక్

కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.

  • Written By:
  • Updated On - October 10, 2022 / 06:11 PM IST

Hyderabad: కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది. మునుగోడు అభ్యర్థి విషయంలో టీపీసీసీ నేతలు నలుగురి పేర్లతో ఏఐసీసీకి నివేదిక పంపినట్లు తెలుస్తోంది.

టీపీసీసీ పెద్దలు పంపిన జాబితాలో పాల్వాయి స్రవంతి, చ‌ల్లమ‌ల్ల కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపింది. మునుగోడులో మంచి పేరు ప్రతిష్టలు ఉండడం కూడా ఆమెకు కలిసి వచ్చిందని భావిస్తున్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో 27,441 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. 2018లో మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో స్రవంతి తప్పుకున్నారు. ఆ విధేయతనే ఇప్పుడు ఆమెకు కలిసి వచ్చి, సీటు దక్కిందని అనుకుంటున్నారు.

అయితే పాల్వాయి స్రవంతికి టికెట్‌ ఇప్పించడం ద్వారా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడుకు సీనియ‌ర్లు క‌ళ్లెం వేశారా, అంటే ఔన‌ని అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి రేవంత్ ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ల్లమ‌ల్ల క్రిష్ణారెడ్డి. మునుగోడుకు ఉప ఎన్నిక ఖ‌రారు అని తేలిన‌ప్పటి నుంచి ఆయ‌న పేరే ప్రముఖంగా విన్పిస్తూ వ‌చ్చింది. ఆర్ధికంగా బిజెపి త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌నున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్దిని ఢీకొట్టాలంటే చ‌ల్లమ‌ల్ల క్రిష్ణారెడ్డి మాత్రమే తూగ‌గ‌ల‌ర‌నే చ‌ర్చను తెర‌పైకి తీసుకొచ్చారు. రేవంత్ క్యాంప్ నుంచి ప్రముఖంగా విన్పించిన పేరు మాత్రం ఇదే. అయితే న‌ల్లగొండ‌కు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేతలు అంద‌రూ పాల్వాయి స్రవంతి వైపు మొగ్గుచూపారు. దీంతో రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలిన‌ట్లు అయింద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీల‌క‌మైన ఉప ఎన్నిక అభ్యర్ధి విష‌యంలో ఆయ‌న మాట చెల్లుబాటు కాలేద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇది సీనియ‌ర్లకు సంతోషాన్ని మిగ‌ల్చగా, రేవంత్ క్యాంప్ కు ఒకింత నిరాశ క‌లిగించింద‌నే చ‌ర్చ సాగుతోంది.

ఏది ఏమైనా కూడా ఇప్పుడు పాల్వాయి స్రవంతి గెలుపు కోసం రేవంత్‌రెడ్డి త‌న స‌ర్వశ‌క్తులు ఒడ్డాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. మ‌రి ఇప్పుడు చ‌ల్లమ‌ల‌ క్రిష్ణారెడ్డి ఈ ఎన్నిక‌లో స్రవంతికి స‌హక‌రిస్తారా లేదా అన్నది ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. మరోవైపు, టికెట్ ఆశించి నిరాశపడిన కృష్ణా రెడ్డి, పల్లె రవి, కైలాశ్‌లను బుజ్జగించేందుకు టీపీసీసీ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్, బిజెపి అభ్యర్దులు ఎవ‌రో తేలిపోయారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్ధిని ప్రక‌టించాల్సి ఉంది. గ‌తానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ చివ‌రి నిమిషం వ‌ర‌కూ నాన్చకుండా కాస్త తొంద‌ర‌గానే అభ్యర్ధిని ప్రక‌టించ‌టం శుభ‌ప‌రిణామంగా పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.