Andhra Pradesh: పవన్‌కు నేనున్నా అంటూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో కలకలం రేగింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని భావిస్తోన్న వైసీపీ అధినేత జగన్‌కు ఈ పరిణామం మింగుడు పడడం లేదని అంటున్నారు.
ఎందుకంటే, ఇప్పటి వరకు టీడీపీ-జనసేన రెండు పార్టీలు కలిస్తేనే, తమకు అధికార పీఠం దూరమవుతుందని, వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో `దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్!` అంటూ పవన్‌మీద కామెంట్లు చేస్తున్నారు. జనసేన-టీడీపీ ఎక్కడ కలిసి పోటీ చేస్తాయని అనుకున్నారో, ఏమో జగన్ ఆయా పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన రెండూ ఒకటేనని, నమ్మొద్దని ప్రజలకు జగన్ నేరుగా చెబుతున్నారు. ఇలా జనసేన-టీడీపీ కలిస్తేనే ఇబ్బంది తప్పదని, భావిస్తున్న వైసీపీకి ఇప్పుడు రాజకీయాలపై చిరంజీవి ప్రకటన కూడా హడలెత్తి స్తోందని, వైసీపీలోనే ఓ వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే, చిరు అభిమానం పవన్ సేవా గుణం రెండూ కలిస్తే, యూత్ ఓటు బ్యాంకు పూర్తిగా వారికే దక్కుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, మళ్లీ అధికారంలోకి రావాలన్న వైసీపీ లక్ష్యం నెరవేరకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అన్న-తమ్ముడు కలిస్తే, చిత్తడైపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరుకు, ఇప్పటికీ రాజకీయంగా కొంత మంది నేతలపై పట్టుంది. ఈ నేపథ్యంలో వారిని పవన్‌కు అనుకూలంగా మార్పు చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు తమకు పదవులు దక్కలేదని భావిస్తున్న వైసీపీ అసంతృప్తులు సైతం, జనసేన బాట పట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ కావాలో, వైసీపీ నేతలకు అర్ధం కాని పరిస్థితిగా మారిందని అంటున్నారు. తమ వాడుగా అనుకున్న చిరు, తన తమ్ముడి వైపు మొగ్గు చూపడంతో విజయసాయిరెడ్డి వంటి నేతలకు గట్టి షాక్ ఇచ్చినట్టే అయిందని భావిస్తున్నారు. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరోవైపు, సామాజిక వర్గాలకు అతీతంగా కూడా జనసేనలోకి చేరే నాయకులు పెరుగుతారని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే, వైసీపీలో టికెట్ వస్తుందో రాదో అనే బెంగ నాయకులను వెంటాడుతోంది. ఈ పరిణామాలతో వైసీపీ భారీగా దెబ్బతినడం ఖాయమని, గతంలో ఒక్క ఛాన్స్ అంటేనే జగన్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు కొత్త నాయకుడు, పైగా చిరు వంటి మెగా కారెక్టర్ ఉన్న వ్యక్తి దన్నుగా ఉంటానని చెప్పడంతో మరింతగా ప్రజలు పవన్‌వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.