Macherla: టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో. జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి. టీడీపీ సభలు అడ్డుకోడానికే ఈ చీకటి జీ.వో. అని చంద్రబాబు విమర్శించగా, తమ వారాహి యాత్రని అడ్డుకోడానికే ఈ కొత్త ఆంక్షలు అని పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలని ఖండిస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ఈ నిబంధన (జీ.వో.) అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే అధికార వైసీపీకి కూడా వర్తిస్తాయి. అలా కాని పక్షాన అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు అని సమర్ధించుకుని రెండు రోజులు గడవకముందే మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి రోడ్ షో,ర్యాలీ ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిచ్చింది.
గత నెల మాచర్లలో చోటుచేసుకున్న గొడవలు కారణంగా మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉండగానే వైసీపీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భారీ రోడ్ షో,ర్యాలీ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో కు అనుమతించని పోలీసులు, మాచర్ల నియోజకవర్గం రోడ్ షోలో దగ్గర ఉండి పిన్నెల్లికి భద్రత కల్పించారు.
మాచర్ల మండలం లోని బైరవునిపాడులో బధవారం రాత్రి ఏర్పాటు చేసిన వైసిపి కార్యక్రమంలో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పోలీసులు కూడా రోడ్ షో లో పాల్గొని భద్రత కల్పించడం గమనార్హం. ఇలా బహిరంగంగా రోడ్ షో లు నిర్వహించడం పై నియోజకవర్గ ప్రజలు నిబంధనలు వైసీపీ పార్టీ కి వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.