Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్‌పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. దీని గురించి నేను మాట్లాడలేదని చాలా మంది తిట్లు తిడుతున్నారు. దీనిపై నిజమైన అభిమానులు బాధపడితే, దానిని నిజమైన బాధ అనుకోవాలి. కానీ ఎన్టీఆర్ హంతకులు బాధను నటిస్తున్నారు. వాళ్ల 14 ఏళ్ల పాలనలో ఏ శాశ్వత పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా? వెన్నుపోటు పొడిచావు కాబట్టి, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 1998లో వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలా, జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఉండాలా అని ప్రభుత్వం రెండు ఆప్షన్స్ ఇస్తే, నేను జిల్లాకే ఉండాలని చెబుతాను. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినప్పుడు వాళ్లు ఎందుకు స్పందించలేదు అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.
జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా? వర్సిటీకి ఉండాలా? అంటే తాను జిల్లాకే ఉండాలని కోరుకుంటానని చెప్పారు. జిల్లా పెద్దదని, యూనివర్సిటీ చాలా చిన్నదని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబు నాయుడే చెప్పారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. త్వరలోనే నేను ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తాను. ఏదైనా గొప్ప ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు తీసుకురావాడానికి సీఎంకు లేఖ ఇస్తానంటూ ఆమె పేర్కొన్నారు. ఇక్కడ ఎన్టీఆర్‌ను అగౌరవ పరిచిందేమి లేదని అన్నారు. ఈ నిర్ణయం పై తటస్థంగా ఉండే వారంతా ఆలోచన చేయాలని లక్ష్మీపార్వతి కోరారు.