Andhra Pradesh: బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని మాజీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు ఉపయోగపడుతుందనే జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్నాని అన్నారు. మోదీ, అమిత్ షాలు ప్రయోజనం లేనిదే ఎవరినీ పిలవరని, ఎవరితోనూ కలవరని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని అధికారం తేవాలన్నదే మోదీ, అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ జరిగిందన్నారు.
ఎన్టీఆర్ 25కు పైగా తెలుగు సినిమాలలో నటించారని ఆయన నటన గురించి అందరికీ తెలుసన్నారు. హిందీలో కూడా ఎన్టీఆర్ సినిమాలు డబ్ అవుతుంటాయి కాబట్టి వాటిలో చాలావరకు అమిత్ షా చూసివుంటారని మాజీ మంత్రి అన్నారు. అలాంటిది ఇప్పుడే ఆయనను నటనను అమిత్ షా గుర్తించినట్లు తాను భావించడం లేదని అన్నారు. కేవలం ఒక సినిమాలో యాక్షన్ బావుందని ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని తాను అనుకోవడం లేదని నాని పేర్కొన్నారు.