Harirama Jogaiah: కాపులకో లేఖ అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఓ ఘాటైన లేఖ రాశారు. ఈ సారి పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకోలేకపోతే ఇంకెప్పుడూ కాపులకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదని జోగయ్య హెచ్చరించారు. చిరంజీవి హయాంలో ప్రజారాజ్యం అధికారాన్ని దక్కించుకోలేక పోయిందని, 2019లో పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకోలేక పోయామని జోగయ్య గుర్తు చేశారు. కాపులలోని అనైక్యతే దీనికి కారణమని జోగయ్య చెప్పారు. ఈ పర్యాయం మరో అపజయాన్ని మీద వేసుకోకూడదని ఆయన హెచ్చరించారు.
బాబు, పవన్ సమానంగా సిఎం పదవిని పంచుకోవాలి..(Harirama Jogaiah)
టిడిపి- జనసేన కలిసి పయనిస్తే వైఎస్సార్ పార్టీని ఓడించడం సులభమని, ముఖ్యమంత్రి పదవి ఎవరిదనేదే ఈ సయోధ్యకి అడ్డంకిగా నిలుస్తుందని జోగయ్య విశ్లేషించారు. చంద్రబాబుకి పూర్తికాలం పట్టం కట్టేందుకు జనసైనికులు, పవన్ కళ్యాణ్‌కి పూర్తికాలం సిఎంగా పట్టం కట్టేందుకు టిడిపి శ్రేణులు సిద్ధంగా లేరని జోగయ్య వివరించారు. బాబు, పవన్ సమానంగా సిఎం పదవిని పంచుకోగలిగితేనే ఉభయపార్టీల కార్యకర్తలకి సంతృప్తిగా ఉండి, ఎన్నికల్లో ఓట్ల ట్రాన్స్‌ఫర్ సక్రమంగా జరుగుతుందని లేకుంటే పొత్తుకే ముప్పు వస్తుందని జోగయ్య హెచ్చరించారు.
ఒంటరిగా వెళ్లినా అధికారం జనసేనదే..
ఉభయ పార్టీల మధ్య సయోధ్య కుదరకపోతే జనసేన ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చూపించాల్సి వస్తుందని జోగయ్య అన్నారు. ఇది ప్రయోగం కానేకాదని, ఒంటరిగా పోటీ చేసినా జనసేన బలానికి ఢోకాలేదని జోగయ్య తెలిపారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒంటరిగా వెళితే హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని జోగయ్య జోస్యం చెప్పారు. అప్పుడైనా సిఎం జగన్‌ని తట్టుకోలేక పార్టీ భవిష్యత్ దృష్ట్యా గత్యంతరం లేక పవన్ కళ్యాణ్‌ని సిఎం సీట్లో చంద్రబాబు కూర్చోబెట్టక తప్పదని జోగయ్య విశ్లేషించారు.
ఒంటరిగా వెళ్ళినా పొత్తు కుదిరినా పూర్తికాలం అధికారం జనసేనదేనని, పవన్ సిఎం కావాల్సిందేనని జోగయ్య రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. ఒంటరిగా వెళ్ళి అధికారం తమదే అని టిడిపి ఊహించుకుంటే అది కలలు కనడం మాత్రమేనని జోగయ్య అన్నారు.కాపులకి రాజ్యాధికారం దక్కాలంటే టిడిపి లేదా మరో పార్టీతో కలిసి వెళ్ళాలా.? లేక ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలా అన్నది పవన్ కళ్యాణ్‌కే వదిలేద్దామని, క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అధినాయకుడి వెంట నడవటమే మన వంతని, సత్ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుందని జోగయ్య కాపు కులస్థులకి హితవు పలికారు.
జనసేన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేవని జోగయ్య విశ్లేషించారు. జనసేన పోటీ చేయకుండా టిడిపితో కలిసి ప్రయాణం చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని గ్రహిస్తే మంచిదని జోగయ్య సూచించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనని కలుపుకుని ప్రయాణం చేయవలసి వస్తే తెలుగు దేశం పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా నాలుగు మెట్లు కిందికి దిగాలని జోగయ్య అన్నారు.