Rapolu Anand Bhaskar: బీజేపీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు  జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా లేఖ పంపారు.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 04:15 PM IST

Hyderabad: మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు  జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా లేఖ పంపారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన రాపోలు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

రాపోలు తన లేఖలో పార్టీ వైఖరి పై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కానీ ఆక్సిజన్‌ కొరతతో ఎవ్వరూ మరణించలేదని కేంద్రం ప్రకటించింది. కరోనా కట్టడిలో విజయం సాధించామని సంబరాలు చేసుకుంటుంటే, ప్రభుత్వ చర్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తిచూపడం నా లక్షణం కాదు. హుందాతనం అనిపించుకోదని తెలుసు. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొంటారని ఈ విషయాలు వెల్లడిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను అందకుండా చేస్తున్నదని అన్నారు. గడిచిన నాలుగేండ్లలో పార్టీ నాయకత్వం తనని విస్మరించిందని రాపోలు తన లేఖలో ఆరోపించారు. తనను ఎన్నోసార్లు అవమానించారని, తక్కువ చేసి చూశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో తనకి ప్రాధాన్యం లేకుండా చేసినా ఆవమానాలను దిగమింగుతూనే వచ్చానన్నారు.

జర్నలిస్ట్ గా పనిచేసిన ఆనంద భాస్కర్ 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.