Site icon Prime9

Munugode Bypoll: టీఆర్ఎస్ ఇజ్జత్ కు సవాల్ గా ’మునుగోడు‘ ఎన్నిక

Munugodu Election

Munugodu Election

Munugode: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుతోందని చాటుకునేందుకు బీజేపీకి, రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని చాటేందుకు కాంగ్రెస్‌కు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ తమ పట్టు ఏమాత్రం చేజారలేదని చెప్పేందుకు టీఆర్ఎస్‌కు మునుగోడు కీలకమైంది. దీనికితోడు ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల్లో ఏది గెలిచినా వాటికి ఈ స్థానం బోనస్‌గా నిలవనుంది.

మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు మండలాలున్నాయి. నియోజవకర్గానికి మొత్తం 15 మంది మంత్రులకు టీఆర్ఎస్ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. వీరిలో కీలక నేతలు హరీశ్ రావు కేటీఆర్ ఉన్నారు. మొత్తం అందరూ కలిపి 71 మంది ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో టీఆర్ఎస్ మునుగోడుకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే ఉమ్మడి జిల్లాలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు లభించిన నేపథ్యంలో ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా మునుగోడు ముచ్చటే వినిపిస్తోంది. మునుగోడులో ఎవరి మధ్య పోటీ, ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే నడుస్తోంది. ఇక ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు వివిధ సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇక సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోలోపల మాత్రం కొన్ని సెక్షన్ల ఓటర్లు టెన్షన్ పెట్టిస్తున్నారట. దుబ్బాక, హుజూరాబాద్ సీన్ రిపీట్ అవుతుందోనన్న ఆందోళన టీఆర్‌ఎస్‌ నేతల్లో నెలకొంది.వీరిలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావుకు అప్పగించిన బాధ్యతలు ప్రత్యేకంగా నిలిచాయి. హరీశ్ కు మర్రిగూడ మండలం ఇన్ చార్జిగా బాధ్యతలు ఇచ్చారు. ఇదే మండలంలో కిష్టరాయిన్ పల్లి, చర్లగూడెం రిజర్వాయర్లు ఉన్నాయి. డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వీటిని చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగమైన కిష్టరాయిన్ పల్లి, చర్లగూడెం జలాశయాల నిర్మాణంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీటి నిర్వాసితులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏకంగా ఆర్డీవోనే తమ నిరసన దీక్షా శిబిరంలో కూర్చోబెట్టారు. ప్రభుత్వం పైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం మంజూరులో సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.

మర్రిగూడ మండలంలో డిండి రిజర్వాయర్ నిర్వాసితుల ఓట్లు 5 వేలపైగానే ఉన్నాయి. వీరంతా తమకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ తరహాలో పరిహారం కోరుతున్నారు. ఈ తరహా పరిహారం కోసమే ఇటీవల రోజుల పాటు ఆందోళనలు నిరాహార దీక్షలు సాగించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించినా పూర్తిస్థాయిలో వారి డిమాండ్లు నెరవేరలేదు. మరోవైపు ఉప ఎన్నిక రావడంతో 5 వేల మంది నిర్వాసితుల ఓట్లు కీలకంగా మారాయి. నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే అందులో రెండున్నర శాతం ఓట్లు వీరివే. అంతేకాక నిర్వాసితుల ప్రభావం మిగతా నిర్వాసితులతో పాటు ఓటర్లపైనా పడుతుంది. దీంతోనే అధికార టీఆర్ఎస్ ఇప్పుడు కలవరపడుతోంది. అయితే, సమస్యలను పరిష్కరించడంలో మంత్రి హరీశ్‌రావుది అందవేసిన చేయి. ప్రజలకు కూడా హరీశ్ హామీ ఇచ్చారంటే చాలా భరోసా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పేందుకు మర్రిగూడ మండల బాధ్యతలను ఆయన అప్పగించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి నిర్వాసితులను హరీశ్ ఏం చెప్పి చల్లబరుస్తారో చూడాలి.

మరోవైపు, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో యువత ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారనే చర్చ అప్పట్లో జరిగింది. ఆ రెండు నియోజక వర్గాలకు చెందిన ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రం వారంతా వచ్చి ఓట్లు వేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతోనే వారంతా స్వచ్చందంగా వచ్చి ఓటు వేశారన్న చర్చ నడిచింది. ఇక ఆ రెండు ఎన్నికల్లో యువత హడావిడి కూడా ఎక్కువగానే కనిపించింది. ఇప్పుడు మునుగోడులో కూడ యూత్ చేస్తున్న హంగామా అధికార పార్టీని అయోమయానికి గురి చేస్తోందట. ఇక మునుగోడులో యూత్ ఓట్లకు గాలం వేయాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వారికి కావాల్సిన వనరులను అందిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ కంటే కాషాయ పార్టీ ముందుందనే టాక్ వినిపిస్తోంది. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం జోరు పెంచారు. ఆయన ప్రసంగాలు యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఉండటంతో ఇప్పుడు టిఆర్ఎస్‌లో గుబులు పెరుగుతోందన్న టాక్‌ వినిపిస్తోంది. గత జిహెచ్ ఎంసి ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలను టిఆర్ఎస్ నేతలే గుర్తు చేస్తున్నారట. ఆ ఎన్నికల్లో యువత ఓట్లే తమ కొంప ముంచాయని చెప్పుకుంటున్నారట. ఇప్పుడు మునుగోడులో అదే సీన్ రిపీట్ అయితే అసలుకే మోసం వస్తుందనే భావనలో టిఆర్ఎస్ నేతలున్నారట.

మునుగోడులో యూత్ ఓటర్లకు గాలం వేసేలా గులాబీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. అవసరం అయితే అన్ని మండలాల్లో కేటీఆర్‌తో రోడ్ షో లు నిర్వహించి యూత్ ను ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నారట టిఆర్ఎస్ నేతలు. మరి టిఆర్ఎస్ నేతలు వేస్తున్న ఎత్తులు ఈ మేరకు ఫలిస్తాయో చూడాలి.

 

Exit mobile version